
గణేశ్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంఽధిత అధికారులతో గణపతి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో రూట్ మ్యాప్ ద్వారా గణేశ్ మండపాల ఏర్పాటు, విగ్రహాల ఎత్తు తదితర అంశాలు పరిశీలించాలన్నారు. శాంతి కమిటీలు, ఉత్సవ నిర్వహణ కమిటీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మెడికల్ క్యాంపుల కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం చెరువులు నిండి ఉన్నాయని, చిన్న పిల్లలు, ఈత రానివారిని నిమజ్జనానికి తీసుకెళ్లొద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అవసరాల మేరకు కొనుగోలు చేయాలి
కేసముద్రం: రైతులు ప్రస్తుత అవసరాల మేరకు యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఎరువుల దుకాణం, మున్సిపాలిటీ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జెడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫరా అవుతుందని అన్నారు. ఈ మేరకు స్టాక్‌తో పాటు యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జెడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కిచెన్ షెడ్ పరిశీలించి విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఏఓ వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.