
ముమ్మర తనిఖీలు
తొమ్మిది షాపుల లైసెన్స్ సస్పెండ్..
సాక్షి, మహబూబాబాద్: ఒక వైపు రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈమేరకు అక్రమ విక్రయాలపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘యూరియా పక్కదారి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పందించారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌లతోపాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి నిబంధనలు పాటించని తొమ్మిది ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్‌లను సస్పెండ్ చేయించారు.
జిల్లా వ్యాప్తంగా..
యూరియా పంపిణీలో అక్రమాలను కట్టడి చేసేందుకు బుధవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ మహబూబాబాద్, మరిపెడ, కురవి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాంల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్ల వివరాలను పరిశీలించారు. మరిపెడ మండలం తానంచర్ల, దంతాలపల్లి మండల కేద్రంలోని ఫర్టిలైజర్ షాపులను అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, అదే విధంగా మండలాల్లో ఏడీఏ, ఏఓలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు పర్యటించి ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్‌ను పరిశీలించారు. యూరియా పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా యూరియా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యూరియా
పక్కదారిపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లా వ్యాప్తంగా
ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
నిబంధనలు పాటించని
తొమ్మిది షాపులపై చర్యలు
లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన
అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి
నిబంధనల ప్రకారం ఈ–పాస్‌లో నమోదు చేయకుండా యూరియా విక్రయాలు, అక్రమ నిల్వలు, రైతుల ఆధార్ నమోదు లేకపోవడం, అధిక రేట్లకు విక్రయాలు జరిపారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం స్టేజీ వద్ద గల శరత్ ఫర్టిలైజర్స్‌తోపాటు మహబూబాబాద్‌లోని సింగారం శ్రీరామలింగేశ్వర ఫర్టిలైజర్స్, డోర్నకల్ మండలంలోని బాలాజీ ఫర్టిలైజర్స్, వీరవెంకట సత్యనారాయణ ఫర్టిలైజర్స్, చిల్కోడులోని మణికంఠ ఫర్టిలైజర్స్, చిన్నగూడూరు మండలంలోని తేత జాశ్వినీ ఫర్టిలైజర్స్, మరిపెడ మండలంలోని వినయ్ ఫర్టిలైజర్స్, కురవి మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, రైతు మిత్ర ఫర్టిలైజర్ల లైసెన్స్‌లు సస్పెండ్ చేసినట్లు డీఏఓ తెలిపారు.