
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ రూరల్: డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. మహబూబాబాద్ పట్టణం, కురవి, మరిపెడ మండలాల్లోని ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్‌లలో ఎరువుల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాకు నమోదును అధికారులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. యూరియాను కొనుగోలు చేసేటప్పుడు రైతులు భూమి వివరాలు, ఆధార్ కార్డును పరిశీలించి ఇవ్వాల్సిందిగా వ్యాపారస్తులకు సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి జిల్లాకు కావాల్సిన మేరకు యూరియాను తెప్పిస్తామన్నారు. యూరియా బస్తాల పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.