చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఎన్నికల్లో గెలిచినా న్యాయం జరగని పరిస్థితి ఉందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కల్లూరులోని తన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారన్నారు. ఎన్నికలకు ముందే కల్లూరు అర్బన్‌ 22 వార్డులో ఫోర్త్‌ టౌన్‌, ఇతర పోలీసు స్టేషన్ల సీఐలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు 41ఏ నోటీసులు ఇచ్చి తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఒక సీఐ అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థినే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టిన పరిస్థితి ఉందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా వ్యవహారం కొనసాగిందని కాటసాని అన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా హౌస్‌ అరెస్టులు చేశారన్నారు. బస్తిపాడు గ్రామంలో కల్లా వెంకట రమణారెడ్డి, కొంగనపాడు గ్రామంలో కేశవరెడ్డి, నాయకుల్లు గ్రామంలో చంద్రశేఖర్‌రెడ్డిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును, ప్రచారం చేసే హక్కును పోలీసుల ద్వారా కాలరాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రీకౌంటింగ్‌ పేరుతో గందరగోళం

కల్లూరు అర్బన్‌ 50వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా రీకౌంటింగ్‌ పేరుతో గందరగోళం సృష్టించారన్నారు. డిక్టరేషన్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఓర్వకల్లు మండలం ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ గెలిస్తే టీడీపీ గెలిచినట్లు ప్రకటించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఉప్పలపాడు, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లోనూ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మూడు స్థానాల ద్వారా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే పాణ్యం నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులు నేరుగా ఫోన్లలో అధికారులతో మాట్లాడి సూచనలు ఇచ్చారని విమర్శించారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌లోనూ పారదర్శకత లేకపోతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని కాటసాని ప్రశ్నించారు.ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ ఎస్‌. రేణుక, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement