కర్నూలు(హాస్పిటల్): డిప్లమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్(డిప్ల్లమా ఇన్ పారామెడికల్) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 10న (మంగళవారం) రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కళాశాలలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. మొదటి విడతలో మిగిలిన సీట్లతో పాటు ఖాళీ అయ్యే సీట్లను కలిపి రెండో విడతలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రబీలో ఆరు పంటలకు బీమా
కర్నూలు(అగ్రికల్చర్): రబీలో ఆరు పంటలకు బీమా కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పప్పుశనగ, వేరుశనగ, జొన్న, ఉల్లి, వరి, వాతావరణ ఆధారిత బీమా కింద టమాట పంట వస్తుందని పేర్కొన్నారు. వరి పంటకు డిసెంబరు 31లోపు, ఇతర పంటలకు డిసెంబరు 15లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉందని తెలిపారు. పప్పుశనగకు ఎకరాకు రూ.420, వేరుశనగకు రూ.480, జొన్నకు రూ.297, ఉల్లికి రూ.1350, వరికి రూ.630, టమాటకు రూ.1500 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. అక్టోబరు 1 నుంచి డిసెంబరు 15 వరకు బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులు పంటల బీమాకు అర్హులని తెలిపారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందని రైతులు సమీప బ్యాంకుల్లో, సహకార సంఘాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియం చెల్లించాలని సూచించారు.
ఆదోనిలో యువకుడి దారుణ హత్య
ఆదోని అర్బన్: యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదోనిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన షేక్‌ఖాదర్(26) అనే యువకుడు సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఇంట్లో ఉన్న షేక్ ఖాదర్‌ను అదే కాలనీకి చెందిన రంజాన్ అనే యువకుడు బయటకు పిలిపించాడు. ఉద్దేశపూర్వకంగానే గొడవపడి తీవ్రంగా గాయపడిచాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న షేక్కాదర్ను చూసిన స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారని సీఐ తెలిపారు. నిందితుడు రంజాన్‌పై గతంలో దొంగతనం కేసు నమోదయ్యిందని, పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
2.59 లక్షల హెక్టార్లలో
పంట నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ పండ్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ పండ్(ఎస్డీఆర్ఎఫ్) పంపిన ప్రాఽథమిక అంచనాల ప్రకారం కర్నూలు జిల్లాలోని 21 కరువు మండలాల్లో 2,59,746.57 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 2,88,166 మంది రైతులు బాధితులుగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం రూ. 290.14 కోట్లు, ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం రూ.383.61 కోట్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చెల్లించాలని కోరారు. కరువు ప్రాంతాల్లో రైతులకు 1,36,279 టన్నుల దిగుబడులు కోల్పోయారని, కోల్పోయిన పంటల విలువ రూ.929.47 కోట్లు ఉందని నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో 30 రకాల పంటలు దెబ్బతినగా ఇటీవలనే కరువు ప్రాంతాల్లో సెంట్రల్ టీమ్ పర్యటించింది.
నాలుగో స్థానంలో మహానంది
● రెండో స్థానంలో శ్రీ రంగాపురం
మద్దిలేటిస్వామి
మహానంది/బేతంచెర్ల: రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన 14 ఆలయాల్లో భక్తులకు అందే సౌకర్యాలు, వసతులు తదితర వాటిపై ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ నిర్వహించిన భక్తుల అభిప్రాయాలపై మహానంది ఆలయం నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పెంచలకోన ఆలయం 77.0 శాతంతో మొదటి స్థానంలో నిలవగా జిల్లాలోని రంగాపురం శ్రీ లక్ష్మీ మద్దులేటి స్వామి దేవస్థానం 75.3 శాతంతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఆర్జేసీ, డీసీ హోదా కలిగిన ఆలయాల్లో దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?, దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా?, ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా?, దేవాలయాల్లో పారిశుధ్య సంతృప్తికరంగా ఉందా? అనే ప్రశ్నలతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అందులో మహానంది ఆలయం 72.0 శాతంతో కేవలం నాలుగవ స్థానానికే పరిమితం కావడం అధికారుల పాలనా తీరుకు నిదర్శనంగా కనిపిస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


