● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిందని.. నీచ రాజకీయాలకు కేరాఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. చిప్పగిరిలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసుల చేత ఇబ్బంది పెట్టించారన్నారు. బైండోవర్ కేసులు పెట్టించి.. ప్రచారాలు కూడా చేయనీకుండా నిలువరించారన్నారు. కౌంటింగ్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఓట్లు ఆధిక్యంలో రాగానే అధికారులను బెదిరించి రీ కౌంటింగ్ చేయించారన్నారు. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఆలూరు ఎస్‌ఐ మన్మథ విజయ్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కౌంటింగ్ హాల్ నుంచి తొందరగా వెళ్లిపోవాలంటూ హుకూం జారీ చేశారన్నారు. తననే ఇలా అంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఆలూరు–2 ఎంపీటీసీ సభ్యుడు వరుణ్ కుమార్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రాజు, నాయకులు మల్లికార్జున నాయక్, గజ్జలప్ప తదితరులు ఉన్నారు.


