● తప్పిన పెనుప్రమాదం
శ్రీశైలం: మహారాష్ట్రకు చెందిన టూరిస్టు బస్సు ఆదివారం రాత్రి బ్రేక్ ఫెయిల్ కావటంతో పార్కింగ్‌లో ఉన్న ఐదు కార్లను ఢీకొని ఆగిపోయింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు...టోల్‌గేటు దాటిన తర్వాత టూరిస్టు బస్టాండులో ఆగి ఉన్న బస్సును స్టార్ట్ చేసిన ముందుకు కదిలించాలని డ్రైవర్ యత్నించాడు. ఆసమయంలో బ్రేకులు పడకపోవటంతో డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించి అదుపుచేసే క్రమంలో అలంకారేశ్వరస్వామి ఆలయం పక్కన పార్కుచేసి ఉన్న ఐదుకార్లను ఢీకొట్టాడు. ఐదుకార్లు నుజ్జు నుజ్జు కాగా ఓ కారులో ఉన్న బాలికకు స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకొన్న భద్రతా సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. బస్సు ఢీకొన్న నాలుగు కార్లలో యాత్రికులెవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. ఓ కారులోని బాలికకు స్వల్పగాయాలు కావటంతో ప్రథమ చికిత్సలు నిర్వహించారు. వన్‌టౌన్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కె. శివకిషోర్, జిల్లా క్రీడల అబివృద్ధి అధికారి భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీల్లో ప్రతిభ కనబరచాలన్నారు. సేలంలో నిర్వహించనున్న సౌత్‌జోన్ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించి తిరిగి రావాలన్నారు. వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసుఫ్ బాషా, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఫర్జాన్ అన్సారీ పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం
కోసిగి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కోసిగి – ఐరన్‌గల్లు రైల్వే స్టేషన్ మధ్యలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి వయస్సు 30 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. నలుపు రంగు రెడిమేడ్ జీన్స్ ప్యాంట్, తెల్లని అడ్డం గీతలు కలిగిన నలుపు రంగు రెడిమేడ్ ఫుల్‌షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
మహిళ అదృశ్యం
మహానంది: సీతారామపురం గ్రామానికి చెందిన కంచి లక్ష్మీప్రసన్న కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ఎల్. శివాంజల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నకు మార్కాపురం జిల్లా కంభం గ్రామానికి చెందిన రామాంజనేయులుతో వివాహమైందన్నారు. ఇటీవల భర్త వద్ద నుంచి వచ్చి స్వగ్రామమైన సీతారామాపురంలో ఉంటుందన్నారు. అయితే సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆటో ఎక్కి వెళ్లిందన్నారు. ఆమె ఆచూకీ ఎవరికై నా తెలిస్తే మహానంది ఎస్‌ఐ 91211 01093 సమాచారం అందించాలన్నారు.


