● ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు
● పోలీసులు గుర్తించి బంధువులకు
అప్పగించిన వైనం
వెల్దుర్తి: జన్మదిన వేడుకలకు కుటుంబీకులు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోగా.. పోలీసులు గుర్తించి ఇంటికి చేర్చారు. శ్రీరంగాపురం పంచాయతీ మజరా గ్రామం లక్ష్ముంపల్లెకు చెందిన బోయ పెద్ద అయ్యస్వామి, రాణి దంపతులకు కుమార్తె, కుమారుడు. కుమార్తెకు వివాహం కాగా.. 13 ఏళ్ల కుమారుడు జగన్ మోహన్ చదవు నిలిపేసి జీవాల పెంపకంలో కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఈనెల 8వ తేదీ ఆదివారం దీపావళి నాడు తన పుట్టిన రోజు కావడంతో వేడుకలు చేసుకునేందుకు కుటుంబీకులను రూ. 500 అడిగాడు. అయితే వారు నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు పక్కనే ఉన్న గోవర్ధనగిరి గ్రామానికి వెళ్తున్నట్లు చెప్పాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అంతా వెతికారు. బంధుమిత్రుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నరేశ్ విచారణ చేపట్టి నంద్యాల రైల్వేస్టేషన్‌లో బాలుడి ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు.


