కార్తీకం..శుభకరం | - | Sakshi
Sakshi News home page

కార్తీకం..శుభకరం

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

చాంద్రమానంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైనది. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ నెల కార్తీకంగా పేరొందింది. శరదృతువులో రెండవ నెల అయిన ఈ కార్తీకానికి కౌముది మాసం అని కూడా పేరు. కౌముది అంటే వెన్నెల అని అర్థం.

శ్రీశైలంటెంపుల్‌: పరమశివుడు స్వయంభులింగంగా వెలసిన శ్రీశైలమహాపుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. కార్తీకమాసంలో శివున్ని ఆరాధిస్తే సకల ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే మిగతా పర్వదినాల కంటే ఈ మాసంలో శివుడిని ఆరాధించేందుకు భక్తులు ఆరాటపడుతూ శ్రీగిరికి అధికసంఖ్యలో తరలివస్తారు. కార్తీకమాసం ప్రారంభమైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని దీపారాధన చేసుకుంటారు. ఈ మాసంలో ప్రతి సోమవారం కనుల పండువగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమి రోజున కృష్ణానది వద్ద పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం విశేషంగా జరుపుతారు. ఈ నెల 24న ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద సాయంత్రం 6గంటలకు జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. తోరణంలో కాలిన నూలు వత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు.

కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరం..

ఈ మాసం శివారాధనకు, విష్ణు ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి. కార్తీకమాసంలో శివారాధన చెప్పలేనంత పుణ్యఫలితాన్నిస్తుంది. ఈ నెలలో పగలు ఉపవాసం ఉండి, రాత్రి భుజించడం చేస్తూ ప్రదోషంలో శివున్ని ఆరాధించడం వలన శివానుగ్రహం లభించడంతో పాటు సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని పలు పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో పరమేశ్వరుడుని మారేడుదళాలతో, తుమ్మిపూలతో పూజించడం విశేషఫలదాయకం. కార్తీకమాసానికంతటికి విష్ణుదేవుడు ‘దామోదర’ నామంతో అధిపతిగా ఉంటాడు. కార్తీకవ్రతాచరణ ప్రారంభంలో ‘‘నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే’’ అని దామోదరుని ప్రార్థిస్తారు. అదే విధంగా ఈ మాసంలో చేసే ప్రతిపుణ్యకార్యాన్ని కూడ ‘‘కార్తీక దామోదర ప్రీత్యర్థ్యం’’ అని సంకల్పించడం సంప్రదాయం. కార్తీకమాసంలో గృహనిర్మాణాలు అరంభించడం మంచిది. ఇంటినిర్మాణాలు చేపట్టడంతో ధనధాన్య లాభం సిద్ధ్దిస్తుందని మత్స్యపురాణం చెబుతుంది. కార్తీకవ్రతాచరణలో ఆచరించాల్సిన కొన్ని నియమాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. వీటిలో కార్తీకస్నానం, ఉపవాసం, దీపారాధన, దానధర్యాలు, సోమవారవ్రతం ముఖ్యమైనవి.

వనభోజనాలు

కార్తీకమాసంలో ముఖ్యమైన అంశం వనభోజనాలు. ఈ వనభోజనాలను పలు వృక్షజాతులున్న వనంలో ఉసిరిక చెట్టు కిందనే చేయాలని శాస్త్రం చెబుతుంది. వనంలోనే వంటలను వండుకోని తినాలి. ఈ వంటల్లో ఉసిరిక కాయలను విధిగా వినియోగించాలి. వనభోజనాల్లో ముందుగా ఉసిరిక చెట్టు కింది భాగాన్ని గోమయంతో అలికి, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ‘శ్రీ ధాత్య్రై నమః’, శ్రీ మేధాయైనమః మొదలైన 21నామాలతో చెట్టును పూజించాలి. అనంతరం చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి, అర్చించి, వనంలోనే వండిన వంటకాలను నివేధించి, భుజించాలి. ఈ వనభోజనాలను చేయడం వలన అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వనభోజనాల సంప్రదాయంలో ఆధ్యాత్మిక అంశాలే కాకుండా సామాజిక ఏకత్వం లాంటి లౌకిక అంశాలు కూడ యిమిడి ఉన్నాయి.

పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలు

భక్తులందరికీ స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ పూజావేళలను మార్పులు చేసి వేకువజామున 4.30 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు.

క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు ఉచితంగా పాలు, అల్పాహారం, తాగునీరు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉత్తరమాఢవీధి వద్ద కార్తీకదీపాలు వెలిగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

శని, ఆది. సోమవారాల్లో, ఇతర పర్వదినాల్లో స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఐదు విడతలుగా స్పర్శదర్శనం కల్పించారు.

కార్తీకపౌర్ణమి సందర్భంగా గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం, పాతాళగంగలో పుణ్యనదీహారతి నిర్వహిస్తారు.

భక్తులందరికీ లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది నూతనంగా పంచమఠాలలో పరమేశ్వరునికి అభిషేకాలను నిర్వహించుకునేందుకు రూ.216 సేవా రుసుంతో ఆర్జిత అభిషేకాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నెల 20న శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని కోటిదీపోత్సవం నిర్వహించనున్నారు.

శ్రీగిరిలో నేటి నుంచి

కార్తీకమాసోత్సవాలు

ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం,

పుష్కరిణి హారతి

కార్తీక పౌర్ణమిన జ్వాలాతోరణం

ఈ ఏడాది నూతనంగా

పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement