మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు నంద్యాల పట్టణానికి చెందిన వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో చీర, సారె సమర్పించారు.
రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై పెరిగిపోతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల నివారణకు వెంటనే రజక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం చాకలి ఐలమ్మ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ చావుకు కారణమైన అధికారులు, అదే గ్రామానికి చెందిన గొల్ల సంజన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల నుంచి సాగులో అనుభవం ఉన్న ఈరమ్మకు చెందిన 26 సెంట్ల భూమిని టీడీపీ నాయకులు రాసి ఇవ్వడం ఽఅధికారులకు తగదన్నారు. వెంటనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేఖర్‌బాబు, పర్ల సుంకన్న, రాముడు, జయమ్మ, ఎల్లయ్చ శివరాముడు, శ్రీనివాసులు, సంజీవ్ పాల్గొన్నారు.
నేడు, రేపు కర్నూలులో వక్ఫ్‌బోర్డు చైర్మన్ పర్యటన
కర్నూలు(సెంట్రల్): ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సోమ, మంగళవారాల్లో కర్నూలు నగరంలో పర్యటించనున్నారు. పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించి అభివృద్ధి, వాణిజ్య అవసరాలకు ప్రతిపాదించిన స్థలాలపై సమీక్ష చేస్తారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షలతోపాటు వక్ఫ్ మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. 11వ తేదీన వక్ఫ్‌పై పీజీఆర్‌ఎస్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం ఈడెన్ గార్డెన్‌లో తాలిమ్–ఏ– హునర్ థ్యాంక్ యూ మీట్‌లో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన అధికారిక పర్యటన ఖరారైంది.
శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం వాహనాలతో నిండిపోయింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వందలాదిగా తరలివచ్చిన వాహనాలతో క్షేత్రంలోని నంది సర్కిల్ మొదలుకొని టోల్‌గేట్ సాక్షి గణపతి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం వన్‌టౌన్ సీఐ గంగనాథ్ బాబు తోపాటు ప్రత్యేక విధులు పై వచ్చిన సిబ్బంది ఆదివారం ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
వసతి గృహ నిర్మాణానికి దాత విరాళం
మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వసతిగృహాల నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఎలమంచిలి నవీణ్ దంపతులు సూట్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వారు ఆదివారం మహానంది క్షేత్రానికి చేరుకుని ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధానిలను కలిసి రూ. 5.50 లక్షలను అడ్వాన్స్‌గా అందజేశారు.
పరిశ్రమలకు కాదు
ప్రజలకు తాగునీరివ్వండి
నందికొట్కూరు: పట్టణ ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామమూర్తి, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో రెండవ రోజు సీపీఐ ఇంటింటి ప్రచార పాదయాత్ర కార్యక్రమం సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్నా పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్దోందని, ఇక్కడి నీళ్లను ఓర్వకల్లు మండలంలోని క్యాంపాకోలా, స్టీల్ పరిశ్రమలకు తరలించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రచార పాదయాత్రలో సీపీఐ నాయకులు పటాన్ మౌలాలి, సుంకన్న, నాగేంద్ర, కురవ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


