ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం
నందవరం: మండలంలోని నందవరం– ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో నందవరం సమీపంలో ఇనుప కడ్డీల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి టాలీ బోల్తా పడింది. బుధవారం ఎమ్మిగనూరు నుంచి నందవరంలో కేజీబీవీ, ఎంపీపీ పాఠశాలలకు పనుల నిమిత్తం చిలకలడోణ గ్రామానికి చెందిన పాండు ట్రాక్టర్‌లో ఐరన్ లోడ్ చేసుకుని బయలు దేరాడు. మార్గ మధ్యలో నందవరం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిలో అదుపు తప్పి ట్రాక్టర్ టాలీ బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దిగాడు. ఆ సమయంలో రోడ్డులో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనూ ప్రమాదం తప్పింది.
కొత్తపేటలో చోరీ
హొళగుంద: కొత్తపేట గ్రామంలోని ఆటో డ్రైవర్ హంపయ్య ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు..ఆటోతో ఆలూరుకు వెళ్లగా హెల్పర్‌గా పనిచేస్తున్న తన భార్య దేవమ్మ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన సమయంలో దొంగలు బీరువాను పగలగొట్టి ఐదు తులాల బంగారు ఆభరణలు, రూ.67 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరామ్‌నాయక్ సిబ్బందితో కలిసి ఇంటిని పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అలాగే కర్నూలు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాల సేకరించారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష
ఆదోని రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన కర్ణాటకకు చెందిన ప్రవీణ్‌కుమార్, ఆదోనికి చెందిన బెస్త శివకుమార్‌లకు ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లీలా సుభాష్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఆదోని తాలూకా పోలీసులు బుధవారం తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌కు 20 రోజులు జైలు శిక్ష, బెస్త శివకుమార్‌కు ఏడు రోజులు జైలు శిక్ష పడిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.


