చెరువు పూడ్చుతున్నా.. కళ్లు తెరవరా?
● కబ్జా కోరల్లో గార్గేయపురం చెరువు
● వెలుగులోకి వచ్చినా అడ్డుకునే వారేరి?
● అధికారుల తీరుపై ప్రజల మండిపాటు
సాక్షి నెట్‌వర్కు: కళ్ల ముందే గార్గేయపురం చెరువు కబ్జాకు గురవుతున్నా అధికారులకు పట్టడం లేదు. అధికార పార్టీ నేత పట్టపగలు రాళ్లు, మట్టితో చెరువును పూడ్చేస్తున్నా అడిగేవారు లేరు. దర్జాగా టిప్పర్లు, జేసీబీలతో చెరువు నామరూపాలు లేకుండా చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువు ఆక్రమణపై పతాక శీర్షికన పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు తెలియనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. చెరువును ఆక్రమించుకుంటున్నా చూసీచూడనట్లు ఉండడంపై తీవ్ర చర్చ సాగుతోంది. మూడేళ్ల క్రితమే కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం చెరువుకు సంబంధించిన భూమిని టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి తన మనువళ్ల పేరిట 3.6 ఎకరాలను అక్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్న అప్పటి రిజిస్ట్రేషన్ శాఖాధికారులు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో 2023 ఆగస్టులోనే ఆయన చెరువులోని తన 3.6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పటి కర్నూలు ఆర్‌డీఓగా ఉన్న హరిప్రసాదు అడ్డుకున్నారు. తక్షణమే పూడ్చిన చెరువు భాగాన్ని యథాస్థితికి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. పనులను నిలుపుదల చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడం, ఆయనే ప్రస్తుతం షాడో ఎమ్మెల్యే కావడం, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉండడంతో మళ్లీ చెరువు ఆక్రమణకు తెరలేపారు. అయితే అప్పట్లోనే ఆర్‌డీఓ హరిప్రసాదు గార్గేయపురం చెరువుపై చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొందరు మాజీ సైనికులకు కేవలం చెరువులో నీళ్లు లేని సమయంలో పంటలను సాగు చేసుకోవడానికే అనుమతులు ఇచ్చామన్నారు. వారికి ఆ భూములను అమ్ముకోవడానికి ఎలాంటి అధికారం ఉండదని, ఎవరూ కొన్నా హక్కులు చెల్లవని, చెరువును పూడ్చితే నీళ్లు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని, ఈ భూములను డీనోటిఫై చేయడం, కన్వర్షన్ కోసం వచ్చిన అనేక వినతులను తిరస్కరించామని అప్పట్లో స్పష్టం చేశారు.
చెరువును రక్షించండి..
గార్గేయపురం చెరువు ఆక్రమణ వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం చెరువు ఆక్రమణ పనులను అడ్డుకున్న అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మరో వైపు చెరువు చుట్టూ నగర వనం ఉండటంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే గార్గేయపురం చెరువు టూరిజం స్పాట్‌గా మారింది. అక్కడ కర్నూలు నగర ప్రజలకు బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే చెరువు ఆక్రమణకు గురవుతుండడంతో టూరిజానికి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. మరోవైపు చెరువు ఆక్రమణ పనులు రేయింబవళ్లు జరుగుతున్నా తహసీల్దార్, సంబంధిత డివిజన్ ఆర్‌డీఓ, వారిపై ఉండే జేసీ, కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం అటువైపు చూడడకపోవడంతో అధికారులంతా టీడీపీ నేతకు హుజూర్ అంటున్నారా.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


