
అంగట్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు
● పోస్టుకు రూ.లక్ష నుంచి
రూ.1.5 లక్షల వరకు వసూళ్లు
● కర్నూలు పెద్దాసుపత్రిలో దందా
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆశావహుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను ఈగల్ హంటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ గత జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో 40 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో 60 మంది సెక్యూరిటీ గార్డులతో సేవలందించేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు టోకుగా రూ.16 వేలకు పైగా జీతం వస్తుందని అధికారులకు చెప్పారు. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పోస్టుకు అభ్యర్థి కనీసం టెన్త్ చదివి ఉండాలని, 45 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, శారీరక ధృడత్వం ఉండాలని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తమకు సబ్‌లీజుకు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు పంతం పట్టారు. ఈ మేరకు ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వారు ఈ సంస్థను సబ్‌లీజుకు తీసుకున్నట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరు ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 25 మందికి పైగానే భర్తీ చేశారు. ఇందులో ఒక్కో పోస్టుకు రూ.లక్షకు పైగా చేతుల మారినట్లు చర్చ నడుస్తోంది. కొందరు దళారులు రంగప్రవేశం చేసి మనం చెప్పినట్లే నడుస్తుందని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకూ పోస్టులు కావాలని మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు వచ్చి గొడవ చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంకా ఖాళీగా ఉన్న వందకు పైగా సెక్యూరిటీ గార్డు పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి మధ్యలో దళారులు సైతం చక్రం తిప్పుతున్నారు. తాము చెప్పిన వారికి పోస్టులు ఇవ్వాలని మరోవైపు కొందరు ప్రజాప్రతినిదులు సైతం ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం.
జీతంలోనూ భారీ కోత
ఎంఓయూ ప్రకారం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.16 వేలకు పైగా జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ నెలలో సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే ఇచ్చారు. కొత్త ఏజెన్సీ వచ్చినా పాత జీతాలేనా అని సెక్యూరిటీ గార్డులు నిట్టూరుస్తున్నారు.