
ఎద్దులను శుభ్రం చేసేందుకు వెళ్లి..
రైతు మృత్యువాత
రుద్రవరం: చెరువులో అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ఓ రైతుతో పాటు రెండు ఎద్దుల ప్రాణం తీశాయి. ఆలమూరు గ్రామంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందిన్నె వుశేన్బాషా (42) అనే రైతు కొద్దిగా ఉన్న సొంత పొలంతో పాటు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పర్వీన్ కూడా మేసీ్త్రగా ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేయిస్తోంది. రోజులాగే వుశేన్బాషా శనివారం శీల బోయిన చెరువు వైపు సేద్యపు పనులకు వెళ్లాడు. పనులు పూర్తయిన తర్వాత ఎద్దుల బండిపై ఇంటికి వస్తూ మార్గమధ్యలో ఎద్దులను శుభ్రం చేసేందుకు చెరువు లోపలికి దింపాడు. రైతు ఎద్దులను నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గుంతలో బండి పోవడంతో ఎద్దులతో పాటు రైతు మునిగిపోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి బయటకు తీయగా వుశేన్బాషా అప్పటికే మృత్యుఒడి చేరాడు. ఎద్దులు సైతం నీట మునిగి మృతి చెందాయి. రుద్రవరం ఎస్ఐ మహమ్మద్ రఫి సిబ్బందితో చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య పర్విన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైతు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్యతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
మట్టి తవ్వకాల వల్లే..
ఆలమూరు శీలబోయిన చెరువులో శనివారం జరిగిన ప్రమాదానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కొందరు చెరువులో అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలుగు పక్కనే కట్ట మీదుగా వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ రాకపోకలు సాగేవి. అయితే అది దారి అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కట్టకు కొద్ది దూరంలోనే పెద్ద గుంతలు తవ్వారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువులోకి భారీగా నీరు చేరింది. ఆ నీటితో పెద్ద గుంతలు సైతం నిండి పోయాయి. గుంతలు గమనించక పోవడంతో ప్రమాదం జరిగి రైతుతో పాటు ఎద్దులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు వాపోతున్నారు.

ఎద్దులను శుభ్రం చేసేందుకు వెళ్లి..