
వడ్లరామాపురంలో నేడు చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: మహారాష్ట్ర – ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ భవనాశి శంక ర్ అంత్యక్రియలు శనివారం ఆయ న స్వగ్రామం వడ్లరామాపురంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర రాజ్‌నంద్ గావ్ జిల్లాలోని మొహాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం తెల్లవారే సరికి చిన్నన్న మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న వ్యక్తి విగతజీవిగా గ్రామానికి చేరుకోనుండడంతో గ్రామస్తులు ఆఖరి చూపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.