
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
శాస్త్రోక్తంగా గోపూజ
శ్రీశైలంటెంపుల్: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, పండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గోపూజ జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.
14 మండలాల్లో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాలో కనిపించలేదు. ఈ నెల 13 నుంచి జిల్లాలో ఆకాశం మేఘావృతం అవుతున్నా వర్షాలు తేలికపాటికే పరిమితం అవుతున్నాయి. ఆలూరులో 12.4 మి.మీ, ఆస్పరిలో 10.4, పత్తికొండలో 5.8, హొళగుందలో 5.2, హాలహర్విలో 4.8 మి.మీ ప్రకారం వానలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 2.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి శనివారం సాయంత్రం నాటికి 5 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 1,33,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలానికి 2,05,212 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాంతాలకు జలాశయం నుంచి 1,89,111 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 91,270 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 70,082 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 25,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.357 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 199.7354 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది.
పోతిరెడ్డిపాడు నుంచి
నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 26వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను 0.05 అడుగు మేర ఎత్తి నీటినిఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 12వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్)కాల్వకు 10వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ