
విప్లవ జోహార్లతో చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: విప్లవ జోహార్లతో సుగులూరి చిన్నన్న అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. నాలుగురోజుల కిందట మహారాష్ట్ర –ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ సుగులూరి చిన్నన్న మృతిచెందారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి శనివారం ఉదయం 10 గంటలకు మృతదేహం వచ్చింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల రెండింటి నుంచి పలువురు వడ్ల రామాపురం చేరుకున్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిన్నన్న అలియాస్ శంకర్, అలియాస్ విజయ్ అంత్యక్రియలు విప్లవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించారు. చిన్నన్న పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి ‘అమర వీరుల ఆశయాలను సాధిద్దాం ... కామ్రేడ్ చిన్నన్న అమర్ రహే’ అని నినదించారు. చిన్నన్న మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ఉంచి గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీతో ఆయన కుటుంబ పొలంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన మృతదేహాన్ని విప్లవ సంప్రదాయాలతో ఖననం చేశారు. అమరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన పద్మ, భవాని, శోభ, అంజమ్మ, విరసం సభ్యులు పినాకపాణి, ఏపీ పౌరహక్కుల సంఘం నాయకులు అల్లాబకాష్, కరీంబాషా, తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు ఆర్.రాజానందం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నర్సింహయ్య, ిసీపీఐ ఎంఎల్ జనశక్తికి చెందిన సుంకన్న, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగన్న, డాక్టర్ గౌరీనాఽథ్, వివిధ దళిత సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాఉద్యమాలను నిర్మూలించడం అసాధ్యం
మావోయిస్టు పార్టీ సభ్యులను కాల్చి చంపడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ రచయితల సంఘం పూర్వ కార్యదర్శి పాణి అన్నారు. శనివారం చిన్నన్న అంత్యక్రియలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో అత్యంత పాశవికంగా ‘కగార్ ఆపరేషన్’ జరుపుతోందన్నారు. అక్కడ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు గిరిజనులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను హతం చేస్తున్నారని ఆరోపించారు.

విప్లవ జోహార్లతో చిన్నన్న అంత్యక్రియలు