
చోరీకి పాల్పడిన కేర్ టేకర్ అరెస్ట్
● రూ. 6.90 లక్షల విలువ చేసే
ఆభరణాలు స్వాఽధీనం
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని గాంధీనగర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో కేర్ టేకర్‌గా ఉంటూ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 6.90 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. గాంధీనగర్‌కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తండ్రి ధనుంజయుడు రిటైర్డ్ ఉద్యోగి. కుమారస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ తండ్రికి కొంత దూరంగా నివాసముంటున్నాడు. తండ్రి బాగోగులు చూసుకోవటానికి హైదరాబాద్‌లోని ఓ సంస్థ నుంచి అనంతపురం టౌన్‌కు చెందిన నిమ్మగంటి చరణ్‌సాయి అనే వ్యక్తిని ఈ ఏడాది జూన్ నెలలో కేర్ టేకర్‌గా నియమించుకున్నాడు. అయితే ఇంట్లో నగలు భద్ర పరిచిన చోటును పసిగట్టిన చరణ్‌సాయి పనిలో చేరిన 15 రోజుల్లోనే ఇంటికి కన్నం వేశాడు. అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు పొరల బంగారు చైన్, రెండు ఉంగరాలు, జత కమ్మలతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎంఎన్ భార్గవి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, హెచ్‌సీ మద్దిలేటి, క్రైం పార్టీ పోలీసులు ఉసేని, రఘునాథ్, సుధాకర్, గోపాల్ బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి చరణ్ సాయిని అనంతపురం టౌన్ తన ఇంటి సమీపంలోని అన్న క్యాంటీన్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను ఒక గోల్డ్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. దీంతో ఆ సంస్థకు నోటీసు జారీ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టౌన్ సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో కొత్తవారిని పనిలో తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విచారించాలన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఎస్‌ఐ–2 శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.