డోన్‌ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన | Sakshi
Sakshi News home page

డోన్‌ చరిత్రలో చెరగని ముద్రవేశాము: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన

Published Mon, Jan 22 2024 1:24 AM

- - Sakshi

ప్యాపిలి: డోన్‌ నియోజకవర్గంలో దాదాపు రూ. 2,700 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ చరిత్రలో చెరగని ముద్ర వేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామంలో రూ. 18.77 కోట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాలు, గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం తదితర భవనాలను ఎమ్మెల్సీ ఇషాక్‌ అహ్మద్‌, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలసి ఆదివారం మంత్రి ప్రారంభించారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో డోన్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై న నాయకులు చేయలేని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికల ముందు కంబగిరి స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లే నాయకులు కనీసం ఆ దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారని మంత్రి విమర్శించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి డోన్‌ నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్యాపిలి మండలంలో మారుమూల గ్రామమైన వంకమెట్టుపల్లికి సైతం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే తన ధ్యేయం అన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని భావించి హుసేనాపురంలో వెటర్నరి పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు.

పశుసంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడానికి కారణం వెటర్నరీ విభాగంలో ఉన్నత చదువులు స్థానికంగా అందుబాటులో లేవని తాను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణం చేతనే హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేశానని తెలిపారు. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వెంటనే సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

గతంలో గొర్రెల పెంపకం ద్వారా సంపద సృష్టించుకున్న గొర్రెల పెంపకందార్లు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో షెప్పర్డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గొర్రెల పెంపకందార్లకు ఈ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు.

హామీలతో మభ్య పెడతారు జాగ్రత్త..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్‌ అహ్మద్‌ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డోన్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్‌ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు.

డోన్‌ అందరికీ ఆదర్శం
డోన్‌ నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఆదర్శమని జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు డోన్‌ నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి విషయంలో మంత్రిని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. తాను కొద్ది రోజులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెంట పర్యటిస్తూ అభివృద్ధి కార్యాక్రమాలు చూస్తేంటే మంత్రి చొరవ అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర మీట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ మెట్టు వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్‌ రహిమాన్‌, శ్రీవేంకటేశ్వర వెటర్నరి యూనివర్సిటి డీన్‌ వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్‌ రవి, డైరీ డీన్‌ సురేశ్‌, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమేంద్రకుమార్‌, ఏడీ సింహాచలం, నోడల్‌ ఆఫీసర్‌ లావణ్యలక్ష్మి, జేడీ రామచంద్రయ్య, డీఏహెచ్‌ఓ గోవిందనాయక్‌, డీడీలు శాంతయ్య, రామమూర్తి, ప్రిన్సిపాల్‌ మాధవి, జేసీఎస్‌ కన్వీనర్‌ బొర్రా మల్లికార్జునరెడ్డి, హుసేనాపురం, కొమ్మేమర్రి సర్పంచులు మహేశ్వర్‌ రెడ్డి, దస్తగిరమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్‌ సెక్రటరీ శ్యాంరెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్‌ బోరెడ్డి పుల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement