అక్రమాలు.. అధికార దుర్వినియోగం! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలు.. అధికార దుర్వినియోగం!

Mar 14 2026 7:37 AM | Updated on Mar 14 2026 7:37 AM

డోన్‌: అక్రమాలతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని డోన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌పై చైర్మన్‌ రాజేష్‌, కౌన్సిలర్ల ధ్వజమెత్తారు. సమాధానాలు చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తనకు కౌన్సిలర్ల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు మున్సిపల్‌ కమిషనర్‌ సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సమావేశం హాలులోకి రావడం, వీడియోలు తీయమని కమిషనర్‌ ఆదేశించడం చూసి చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా పోలీసులు లోపలికి రాకూడదన్నారు. కౌన్సిలర్ల ప్రశ్నలకు స మాధానం చెప్పకుండా బెదిరించే ధోరణిలో కమిషనర్‌ ప్రవర్తించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. డో న్‌లో మున్సిపల్‌ చిట్టచివరి సమావేశం శుక్రవారం వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్య జరిగింది.

ముమ్మాటికీ నేరమే!

నిబంధనలకు విరుద్ధంగా సాయికీర్తన అనే పేరుగల కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌ కూతురికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ద్వారా అభ్యర్థించారని అజెండాలోని 63వ అంశంలో చేర్చడంపై మున్సిపల్‌ చైర్మన్‌, సీపీఐ కౌన్సిలర్‌ సుంకయ్య, వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు సుమలత సురేష్‌, మిట్టా ఉమామహేశ్వరి తదితరులు నిలదీశారు. ఇది ముమ్మాటికీ కమిషనర్‌ అధికార దుర్వినియోగం, బంధుప్రీతికి నిదర్శనమని ఆరోపించారు. 45–191 అనే ఇంటి నంబర్‌ డోన్‌ మున్సిపల్‌ పరిధిలోనే లేదని దొంగ ఇంటి నంబర్‌తో ఎమ్మెల్యేను సైతం తప్పుదోవ పట్టించి ఆయన సిఫారసులు లేకున్నా కూడా అజెండాలో ఆయన పేరును చేర్చడం ముమ్మాటికీ కమిషనర్‌ చేసిన నేరమని ధ్వజమెత్తారు.

ప్రజాధనం దుర్వినియోగం

విధి నిర్వహణలో భాగంగా ప్రతి నెలా వాహనంలో తిరిగేందుకు రూ.30వేలను ప్రజల సొమ్మును అద్దె రూపంలో కమిషనర్‌కు చెల్లిస్తుండగా, అద్దె కారుకు రూ.50వేల వేతనం తీసుకొని మున్సిపల్‌ ఉద్యోగులను డ్రైవర్‌గా పెట్టుకోవడం అనైతికమని కౌన్సిలర్లు అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరపాలన్నారు. దుర్వినియోగం చేసిన సొమ్మును రికవరీ చేయాలని కౌన్సిలర్లు మల్లికార్జునరెడ్డి, దినేష్‌గౌడ్‌, కుమ్మరి రాజు, రైల్వే నాగేంద్ర, మేకల విమల, వెంకటేశ్వరమ్మ, ఆర్ట్‌ రమణ, మౌలాబీ, ఇమాంబీలు డిమాండ్‌ చేశారు.

ధ్రువ సోలార్‌ సంస్థతో కుమ్మక్కు

ప్రతి ఏటా పది కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేక సతమతమవుతుంటే రూ.8కోట్లతో ధ్రువ సోలార్‌ పనులను ప్రోత్స హించేందుకు రుణాలు ఇస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తూ కమిషనర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. పట్టణ పరిధిని అతిక్రమించి మండలంలోని అన్ని గ్రామాలలో ధ్రువ సోలార్‌ గురించి కమిషనర్‌ ప్రచారం చేస్తూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రవర్తిస్తుండటం ఆయన అవినీతికి నిదర్శనమని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జాకీర్‌హుసేన్‌, బుర్రు రమాదేవి, ఫాతిమాభీ, స్వర్ణలత, సుకన్య ఆరోపించారు.

అనుచిత వ్యాఖ్యలు

డోన్‌లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని టీడీపీకి చెందిన మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌ సభ దృష్టికి తీసుకువస్తుండగా కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పందుల వ్యాపారం చేసే వారు కూడా తనపై ఆరోపణలు చేయడమా అని నోరుజారారు. దీంతో చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ఒక్క ఉదుటన లేచి కమిషనర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

చైర్మన్‌ ఆవేదన

కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రసాద్‌గౌడ్‌ వ్యవహరశైలి ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఉందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని కూడా తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్‌ అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

డోన్‌ మున్సిపల్‌ కమిషనర్‌పై చైర్మన్‌,

కౌన్సిలర్ల ధ్వజం

పోలీసులకు కమిషనర్‌ సమాచారం

ఇవ్వడంపై ఆగ్రహం

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

చేస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్‌ రాజేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement