మేం 2023లో పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనలో 4.80 ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అదే ఏడాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వెబ్‌ల్యాండ్‌తో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా మా పేరుమీదనే భూమి ఉంది. 2025 జూలై నెలలోనే రాతనలో గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలసి పాసుపుస్తకం తదితర అన్ని వివరాలు ఇచ్చాం. అయితే అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. నిజమైన రైతులకు సాయం దక్కకపోవడం బాధాకరం. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కనీసం అన్నదాత సుఖీభవ కింద చేయూత కూడా దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
– తెలుగు వెంకటస్వామి,
జి.సింగవరం, కర్నూలు మండలం
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నా మూడు విడతలుగా ఆర్థిక సాయం అందలేదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందింది. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడ లేదు. ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. – బడేసాహెబ్ రైతు,
డీ కోటకొండ గ్రామం, ఆస్పరి మండలం
అప్పులు పెరిగాయి
నాకు సొంత భూమి లేదు. ఐదేళ్లుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రెండేళ్లుగా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ అని పేర్లు పెట్టారు. ఎలాంటి ఫలితం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి అని అడిగితే అధికారులు వస్తుంది... వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
– రాజశేఖర్, కౌలు రైతు,
పచ్చారపల్లి గ్రామం, హాలహర్వి మండలం
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పథకం కింద వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సకాలంలో డబ్బులు పడేవి. విత్తనాలు, ఎరువులు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా వేయకపోవడం దారుణం. – మారెప్ప, రైతు, నిట్రవట్టి,
హాలహర్వి మండలం


