అరకొరగానే ‘అన్నదాత సుఖీభవ’
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవతో అర్హులకు న్యాయం చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇది వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలు, పీఎం కిసాన్ కింద రూ.4వేల ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ నుంచి కౌలుదారులను పక్కన పెట్టారు. మూడవ విడతలో న్యాయం జరుగుతుందని అధికారులు కౌలుదారులను నమ్మించారు. అయితే ఇప్పుడు కూడా కౌలుదారులతో పాటు అర్హులైన పట్టా రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి.
కౌలుదారులను
నట్టేట ముంచిన చంద్రబాబు
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సీసీఆర్‌సీ పత్రాలు పొందిన సాగుదారులకు అన్నివిధాల న్యాయం చేసింది. పెట్టుబడి సాయంగా రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కౌలుదారులతో పాటు ఆర్‌వోఎఫ్‌ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసి పూర్తి మొత్తాన్ని చెల్లించి అండగా నిలిచింది. ఇలా 28,600 మంది సాగుదారులకు వైఎస్‌ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలుదారులకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్‌సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా 24,793 మంది సాగుదారులకు కార్డులు జారీ అయ్యాయి. అయితే అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందించలేకపోవడం గమనార్హం.
21,841 మందికి
అన్నదాత సుఖీభవ ఎగనామం
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్‌ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం 2,72,757 మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. వైఎసార్‌సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ 21,841 మంది రైతులకు తీరని అన్యాయం చేసింది.
కౌలుదారులతో పాటు
భూ యజమానులకు అన్యాయం
జిల్లాలో 2025–26లో
24,793 సీసీఆర్‌సీ కార్డులు జారీ
ఒక్క కౌలుదారుకూ అందని సాయం
చుక్కల భూముల పేరిట
అర్హులకు ఎగనామం


