పెనమలూరు: అర్హులైన ప్రతీ ఒక్క ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గోసాల సచివాలయంలో మంగళవారం ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రజావిచారణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనర్హుల పేర్లు, ఒకే వ్యక్తికి సంబంధించిన బహుళ నమోదులు వంటి అంశాలను గుర్తించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తమ అభ్యంతరాలు క్లెయిమ్స్‌పై స్వయంగా వినిపించే విధంగా అవకాశం కల్పించాలన్నారు. వారు సమర్పించే ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ బాలాజీ సూచించారు. ఈ సందర్భంగా ఓటర్లు తెలిపిన పలు అభ్యంతరాలను కలెక్టర్ విన్నారు. ఆర్డీవో ఎస్.కరుణకుమారి, రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


