జనసేనలో వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

జనసేనలో వర్గపోరు

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

ఆర్‌కే వర్సెస్‌ కొట్టెగా మారిన వివాదం ఎంపీ బాలశౌరి వద్ద కొట్టె వర్గీయుల పంచాయితీ నగర అధ్యక్షుడు గడ్డం రాజును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నియో జకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల పేరుతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండి రామకృష్ణ కొంత మంది జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్‌ అభ్యర్థికి సంబం ధించి తీర్మానం చేశారు. దీనిని కొట్టె వెంకట్రావు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో కొట్టె వెంకట్రావుపై పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు దాడికి పాల్పడటంతో వివాదం మరింత ముదిరింది. గడ్డం రాజుపై చర్యలు తీసుకునేంత వరకు తాము ఊరుకునేది లేదని వెంకట్రావు వర్గీయులు బహిరంగంగా ప్రకటన చేయటం పాఠకులకు విదితమే.

ఎంపీ చర్యలు తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం

జనసేన పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న గడ్డం రాజును తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని లేదంటే తాము తదుపరి కార్యాచరణ ప్రకటి స్తామని వెంకట్రావు వర్గీయులు ఎంపీ వల్లభనేని బాలశౌరిని మంగళవారం కలిసి స్పష్టంచేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండి రామకృష్ణ చేసిన కార్యక్రమాలను మెసేజ్‌ల రూపంలో వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టి ఆయన వద్ద మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఏమాత్రం పార్టీలో గానీ ప్రజల్లో గానీ ఎటువంటి ప్రాబల్యం లేదని వెంకట్రావు వర్గీయులు ఎంపీకి వివరించారు. జనసేన పార్టీ ఏర్పాటు నాటి నుంచి పార్టీకి అండగా నిలిచిన వెంకట్రావును మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రెండు వర్గాలుగా విడిపోవటం వల్ల ప్రజల్లో జనసేన పార్టీ మరింత దిగజారిపోతోందని వారు ఎంపీకి వివరించారు. వివాదంపై ఎటువంటి చర్య తీసుకోకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెగేసి చెప్పారు.

జనసేనలో లొల్లికి మంత్రి మాస్టర్‌ ప్లాన్‌!

జనసేనలో మచిలీపట్నం మేయర్‌ పదవి ఆశిస్తున్న జనసేన నాయకుడు కొట్టె వెంకట్రావుకు మంత్రి కొల్లు రవీంద్రకు గతం నుంచి వివాదాలు ఉన్నాయి. కూటమిలో భాగమైన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బండి రామకృష్ణను ఒకేసారి పక్కన పెట్టేందుకు మంత్రి రవీంద్ర మాస్టర్‌ ప్లాన్‌ వేశారని జనసేన నాయకులు చెవులు కొరుకుంటున్నారు. జనసేనలో వర్గపోరుకు అవకాశం కల్పిస్తే కూటమిలో ఆ పార్టీ పలుచనై పెద్దగా ఒత్తిడి రాదనే ఆలోచనతో తన పార్టీలోని అనుయాయులకు పదవులు కట్టబెట్టుకునేలా ఈ వివాదానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement