నిమ్మ ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలకు రెక్కలు

Aug 26 2026 2:00 AM | Updated on Aug 26 2026 2:00 AM

నిమ్మ ధరలకు రెక్కలు

నందిగామరూరల్‌: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో డజను ధర రూ.100 పలికింది. జూన్‌, జూలై నెలల్లో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలికింది. నాలుగైదు రోజుల నుంచి నిమ్మ ధర రికార్డు స్థాయిలో పెరగటమే కాకుండా ఏకంగా డజను రూ.120కు చేరటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారునికి ఆకాశాన్నంటుతున్న నిమ ధరలు శరాఘాతంగా మారాయి.

కొనుగోలుకు వెనుకాడుతున్న ప్రజలు..

కూరల్లో రుచి కోసం, శీతల పానియాలు, తదితరాల్లో విరివిగా వినియోగించే నిమ్మకాయలను ప్రస్తుతం ఆలోచించి అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలతో రైతుకు ఊరట లభించినప్పటికీ వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడుతుందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా నిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెట్‌లో సరఫరా లేకపోవ టంతో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంతే కాకుండా పెరిగిన రవాణా, కూలీల ఖర్చు సైతం వినియోగదారునిపైనే పడుతుందని నిమ్మ వ్యాపారులు పేర్కొంటున్నారు.

నియోజకవర్గంలో 169 ఎకరాలలో సాగు

నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 169 ఎకరాలలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నందిగామ మండలంలో 54 ఎకరాలు, కంచికచర్ల మండలంలో ఎనిమిది ఎకరాలు, చందర్లపాడు మండలంలో 62 ఎకరాలు, వీరులపాడు మండ లంలో 45 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. సగానికి పైగా నిమ్మ తోటలు రెండేళ్ల నుంచి మూడేళ్ల వ్యవధి వయసుండటంతో దిగుబడులు రావటం లేదు. నిమ్మ ధరలు విపరీతంగా పెరగటంతో వినియోగదారునితో పాటు హోటళ్లు, జ్యూస్‌ సెంటర్‌లపై సైతం ప్రభావం పడుతుందని వ్యాపారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement