మైలవరం: అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థినులు ముగ్గురు కూడా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మాధవి, పీడీ మేజర్ మన్నే స్వామి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కూరగాయల వ్యాను ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై బందరు నార్త్ మండలం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్ కథనం మేరకు.. పెడనకు చెందిన మువ్వల ప్రసాద్ (42) కలంకారీ పనులు చేస్తుంటాడు. మంగళ వారం ఉదయం వ్యక్తిగత పనుల కోసం ద్విచక్ర వాహనంపై బందరుకు బయలుదేరాడు. చిట్టిపాలెం మార్గంలోని సర్వీసు రోడ్డులోకి దిగి సత్య కన్వెషన్ వైపు వస్తుండగా మచిలీపట్నం రైతుబజారులో కూరగాయల లోడు వేసుకుని పెడన వైపు వెళ్తున్న వ్యాను ఢీకొంది. ఈ ఘట నలో ప్రసాద్ రోడ్డుపై పడిపోగా తలకు బల మైన గాయమైంది. ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ రమేష్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): భార్య చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా కృష్ణలంక పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా పెదవడ్లపూడికి చెందిన మట్టుపల్లి రాజేష్ విజయవాడ రైల్వే వర్క్ షాప్‌లో పనిచేస్తున్నాడు. మూడు నెలల కిత్రం అతని భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను బాధను మరిచిపోలేకపోతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10.20 గంటలకు తన బంధువులకు వీడియో కాల్ చేసి, తనకు బతకాలని లేదని, చనిపోతున్నా నని చెప్పాడు. ఆ బంధువులు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక ఎస్‌ఐ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జానీ, రమణ, హోంగార్డ్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తున్న రాజేష్‌ను కాపాడి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సోషల్ మీడియా వేదికగా బాలికకు పరిచయమైన ఓ యువకుడు పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా గర్భవతని తేలింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపేట పోలీస్ స్టేషన్ వెనుక రోడ్డు ప్రాంతంలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా విజయ్ అలియాస్ బబ్లూ అనే యువకుడు పరిచయమయ్యాడు. రోజూ ఫోన్‌లో చాటింగ్ చేసుకుంటూ బాలికను ప్రేమిస్తున్నాని నమ్మించాడు. అయితే కొద్ది రోజుల కిందట బాలికను బయటకు తీసుకువెళ్లిన విజయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. కొద్ది రోజులుగా బాలికకు నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రిలో చూపగా ఆమె గర్భిణి అని వైద్యులు తేల్చారు. బాలికను తల్లిదండ్రులు విచారంచగా విజయ్ వ్యవహారం బయటకొచ్చింది. విజయ్ ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏం చేస్తుంటాడని ప్రశ్నిచగా ఆ వివరాలేవీ తెలియవని బాలిక చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసును సెక్టార్ ఎస్‌ఐ కరుణ విచారించగా, విజయ్ ఆచూకీ కోసం వెస్ట్ ఏసీపీ దుర్గారావు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.


