నాగాయలంక: మండలంలోని తలగడదీవి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)లో పనిచేస్తున్న గ్రామ వ్యసాయ సహాయకుడు (వీఏఏ) పీతా సాంబశివరావు ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, క్రమశిక్షణ చర్యలు, పోలీస్ నమోదు చేయాలని కృష్ణాజిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి గడ్డం రాజేష్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. వీఏఏ సాంబశివరావు ఆర్థిక మోసాలకు పాల్పడటమే కాకుండా మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేయకుండా విధులకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. పలువురు రైతులు విక్రయించిన ధాన్యం సొమ్మును రూ.లక్షల్లో వీఏఏ తన సొంత ఖాతాకు జమ చేసుకున్నారని సమాచారం. గత రబీ సీజన్ నుంచి తలగడదీవి ఆర్‌ఎస్‌కే సంబంధించిన విత్తన బకాయిలు పెద్ద మొత్తంలో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ లిమిటెడ్‌కు చెల్లించకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడని అధికారులు నిర్ధారించారు. వీఏఏ సాంబశివరావుపై రైతు బండ్రెడ్డి సురేష్‌బాబు ఈ నెల 24వ తేదీన మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. మర్రిపాలెం గ్రామానికి చెందిన రైతు మద్ది నాగశ్రీనివాసరావు నుంచి రొటోవేటర్ ఇప్పిస్తానని రూ.24 వేలు తీసుకుని మోసం చేసినట్లు ఏఓకు ఫిర్యాదు అందింది. వీఏఏ సాంబశివరావు తమను మోసం చేశాడని మండలంలో పలువురు రైతుల నుంచి ఫిర్యాదులు అందినట్లు మండల ఏఓ జిల్లా అధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వీఏఏ సాంబశివరావును సస్పెండ్ చేయాలని, మరో వీఏఏను లేదా ఏఈఓను నియమించాలని జిల్లా అధికారులకు ఏఓ విజ్ఞప్తిచేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్ మూడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి. మనోహర్‌కుమార్ ప్రకటించారు. ప్రభుత్వం విడు దల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ.. 2015లో విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు వివరణ ఇస్తూ చట్టంలో చేర్చిన అంశాల కారణంగా ఉపాధ్యాయ నియామకాలకే గాక, సర్వీసులో కొనసాగాలన్నా, ప్రమోషన్ పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఐదు సంవత్సరాల లోపు ఉద్యోగ విరమణ చేసేవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు కొన్ని హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుంద రయ్య మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌లో అర్హత మార్కులు తగ్గించాలన్నారు. అనంతరం డీఈఓ, కలెక్టర్ కార్యాలయాల్లో ఆయా అధికారులకు నేతలు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.లీల, జిల్లా కార్యదర్శి షేక్ ప్రైమర్ సాహెబ్, బి.రెడ్‌స్టార్, ఎం. లలితశ్రీ, నాయకులు ఎ. అనంత కుమార్, అబ్దుల్ హబీ, ఎ.భరత్, ఎం.లింగారెడ్డి, జి.విజయలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: మండలంలోని కానూరులో గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు మంగ ళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్ కథనం మేరకు.. కానూరు బల్లెంవారివీధిలో రైతుబజార్ వద్ద గుర్తు తెలియని వక్తి మృతి చెందాడు. అతని వయస్సు 45 సంవత్సరాలు ఉంటుంది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు 99517 46017 నబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని ఎస్‌ఐ రమేష్ కోరారు.


