ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ డీఈవో కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన రెండో ఘాట్‌రోడ్డు, శివాలయం వద్ద విస్తరణ పనుల నేపథ్యంలో సాంకేతిక బృందం మంగళవారం పరిశీలన చేసింది. దుర్గగుడికి న్యూ ఢిల్లీకి చెందిన మకాఫెర్రి ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్, నాగపూర్‌కు చెందిన ఎనార్క్ డిజైనర్స్ ఇంజినీర్లు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఇంజినీర్లు కొండపైకి చేరుకునే రెండో ఘాట్‌రోడ్డు, శివాలయం వద్ద విస్తరణకు ప్రతిపాదించిన ఇళ్లను పరిశీలించారు. వారి వెంట దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఈ ఎల్.రమా, డీఈఈ అశోక్ ఉన్నారు. రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి అంచనా వ్యయంతో పాటు ఎన్ని నెలలో పనులు పూర్తవుతాయి, రహదారి వెడల్పు, కొండ భౌగోళిక పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలపై నిపుణుల బృందం చర్చించింది. కొండ ప్రాంతంలో చేపట్టే పనులకు సాంకేతిక బృందం ఇచ్చే నివేదికే కీలకం కానుందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.


