
తెలంగాణ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన స్థానిక గాజులపేట వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. స్థానిక శక్తినగర్‌కు చెందిన అనపర్తి సందీప్ (38) ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తాడు. తన వ్యక్తిగత పనులపై బైక్ పైన పశ్చిమ ఇబ్రహీంపట్నం వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెల్తున్న టీఎస్‌ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ తల, ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.