
ట్రావెల్స్ బస్సు ఢీకొని యువకుడు మృతి
రామవరప్పాడు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఎనికేపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన శ్రీనివాసరావు కొత్త ఆటోనగర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనికేపాడు శివాలయం పల్లాల్లో రూమ్‌లో ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్‌కుమార్ శ్రీనివాసరావుకు పరిచయమై స్నేహితులయ్యారు. ప్రవీణ్‌కుమార్‌కు వివాహం కాగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి అని సమాచారం. ఆదివారం రాత్రి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్ ద్విచక్రవాహనంపై రామవరప్పాడు వైపు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఎనికేపాడు జాతీయరహదారిపై మలుపు తిరుగుతున్నారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి రామవరప్పాడు వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మలుపు తిరుగుతున్న వీరిని ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై శ్రీనివాసరావు మృతి చెంద గా, ప్రవీణ్‌కుమార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రవీణ్‌కుమార్ తల్లి ఇటీవల మరణించగా సోమవారం పెద్ద కర్మ జరగాల్సి ఉంది. అనుకోని ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలై చికిత్స పొందుతుండటంతో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని సోదరుడు ఉమాశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.