దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం

Jul 31 2025 7:32 AM | Updated on Jul 31 2025 7:32 AM

దుర్గ

దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్ద శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తరలించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పర్యవేక్షణలో కల్యాణ వేదికపై ఉత్సవ మూర్తులకు నిర్వహించిన కల్యాణోత్సవంలో ఆలయ ఈవో శీనానాయక్‌ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కనులారా వీక్షించి పునీతులయ్యారు. తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు, విశేష అలంకరణ జరిగాయి.

వరద ఉధృతి దృష్ట్యా

అప్రమత్తంగా ఉండండి

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకాశం బ్యారేజీ నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె తన చాంబర్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీకి 3లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, రెండు అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. సిబ్బంది ఎవరైనా సెలవులు పెడితే వారు వెంటనే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ అధికారులు కాలువల వద్ద గట్టి నిఘా ఉంచి ఎప్పటికప్పుడు గమనించుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో దండోరా వేయించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈతకు వెళ్లే వారిని నిలువరించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఎస్టీల ఆధార్‌

నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని షెడ్యూలు తెగలకు చెందిన కుటుంబాలకు నూరుశాతం ఆధార్‌ నమోదు చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు కృష్ణా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో కొంత మంది గిరిజనులకు ఆధార్‌కార్డు లేక పథకాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారి కోసం ప్రత్యేకంగా ఆధార్‌ నమోదు చేపట్టాలని గిరిజన సంక్షేమాధికారికి సూచించామన్నారు. జిల్లాకు ప్రత్యేకించి 20 ఆధార్‌ నమోదు కేంద్రాలు మంజూరు చేశారని, ప్రతి రెండు మండలాలకు ఒక ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలు వినియోగించుకునేలా అందుబాటులో ఉంచామన్నారు. గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి , డీఆర్వో కె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

ఐవీఎఫ్‌ కేంద్రాల

ఆకస్మిక తనిఖీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ఫెర్టీ 9, డాక్టర్‌ సురేంద్ర జాస్తి ట్రస్ట్‌ హాస్పిటల్‌ను బుధవారం జిల్లా ఏఆర్‌టీ, సరోగసి కమిటీ సభ్యులతో కలిసి డీఎంహెచ్‌ఓ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులు, రిజిస్టర్‌లు, ఏఆర్‌టీ సెంటర్‌కు ఉండాల్సిన అనుమతులు, పరికరాలను నిశితంగా పరిశీలించారు. ఈ రెండు కేంద్రాల్లో నిబంధనలకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏ ఆర్‌టీ సెంటర్‌లు, ఆస్పత్రిల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నామన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో  కార్తికేయుని కల్యాణం 1
1/3

దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం

దుర్గమ్మ సన్నిధిలో  కార్తికేయుని కల్యాణం 2
2/3

దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం

దుర్గమ్మ సన్నిధిలో  కార్తికేయుని కల్యాణం 3
3/3

దుర్గమ్మ సన్నిధిలో కార్తికేయుని కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement