
నివాసం ఉండని ఇళ్లలో మీటర్ల తొలగింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల తర్వాత కాలనీ ఇళ్లలో పేదలు నివసించని ఇళ్లను గుర్తించి, విద్యుత్ మీటర్లు తొలగించేందుకు విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేపట్టింది. ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాసం ఉండని ఇళ్లలో విద్యుత్ మీటర్లు, సర్వీస్ వైర్లు తొలగిస్తున్నారు. అయితే కాలనీల్లో రహదారి సౌకర్యం, ఇతర వసతులు లేకపోవడంతో పేదలు నివాసం ఉండడం లేదు. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం నివాసం ఉండడం లేదని, మినిమం బిల్లు చెల్లించడం లేదని, విద్యుత్ వైర్లు చౌర్యానికి గురవుతున్నాయని.. ఇలా మీటర్లు తొలగించేందుకు పలు కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి విద్యుత్ శాఖ మీటర్లు, వైర్లు తొలగిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాలనీల్లో ఇళ్ల లబ్ధిదారులంతా దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కావడంతో ఇళ్లలో మిగిలిన పనులు పూర్తి చేసుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలకు రహదారి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తే నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.