
చంద్ర గ్రహణం
పేదల నివాసాలపై కాలకూటమి విషం చిమ్ముతోంది. కాలనీల్లో రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించకపోగా, ఇళ్లలో నివాసం ఉండడం లేదని నెపం చూపించి ఉన్న విద్యుత్ మీటర్లు, వైర్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటీ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు జగనన్న కాలనీలపై పడింది. తత్ఫలితంగా వాటికి చంద్రగ్రహణం పడుతోంది.
జగనన్న కాలనీలకు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదలు నివసించే జగనన్న కాలనీల్లో చీకట్లు అలముకుంటున్నాయి. విద్యుత్ సౌకర్యం కల్పించిన ఇళ్లలో సైతం పేదలు నివాసం ఉండడం లేదని మీటర్ల తొలగింపునకు విద్యుత్ శాఖ పూనుకుంటోంది. ఇందుకోసం ఆయా కాలనీల్లో ఎన్ని ఇళ్లలో నివాసం ఉండడం లేదో లెక్క తేల్చేందుకు సర్వే నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సర్వేలో భాగంగా ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి ఆయా ఇళ్లకు అమర్చిన విద్యుత్ మీటర్లు, వైర్లు, అక్కడక్కడ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మీటర్ల తొలగింపునకు కారణాలు వేరే ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నందు వల్ల విద్యుత్ మీటర్లు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అసలే పేదలు నివసించే కాలనీలు.. విద్యుత్ సౌకర్యం లేకపోతే అంధకారమేనని లబ్ధిదారులు వాపోతున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా లే అవుట్‌లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. మహిళా లబ్ధిదారుల పేరు మీద పట్టాలు జారీ చేసింది. గ్రామీణ పేదలకు సెంటున్నర, పట్టణ పేదలకు సెంటు భూమి చొప్పున కేటాయించింది. వాటిలో ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 335 జగనన్న లే అవుట్లు వేశారు. వీటిలో 69, 787 ఇళ్లు కేటాయించారు. 13,198 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 56,061 ఇళ్లు బేస్‌మెంట్ నుంచి ఆర్‌సీ వరకు వివిధ దశలలో ఉన్నాయి. ఇంకా 528 ఇళ్ల నిర్మాణం ప్రారంభించ లేదు. ఆయా లే అవుట్‌లలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి మీటర్లు అమర్చారు. కొన్ని లే అవుట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో కొందరు జగనన్న కాలనీల్లోనే సొంత ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. గత ప్రభుత్వం దశల వారీ ఇళ్ల నిర్మాణం చేపడుతూ వచ్చింది. పూర్తయిన ఇళ్లలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ పలు కాలనీల్లో సౌకర్యాలు లేవు.
పేదల నివాసాలపై కాల‘కూటమి’ విషం
నివాసాలు లేని వారి వివరాలు సేకరిస్తూ విద్యుత్ శాఖ సర్వే దొంగతనాల నెపంతో మీటర్ల తొలగింపునకు చర్యలు మౌలిక సౌకర్యాలు లేకే నివాసం ఉండని పేదలు కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఉన్నవి ఊడబీకుతున్నారు అంధకారం అలముకుంటున్న కాలనీలు