ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం
విజయవాడస్పోర్ట్స్: ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దామని విజయవాడ స్కేటర్లు పిలుపు నిచ్చారు. కశ్మీర్‌లోని పహల్‌గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు సంఘీభావంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్లు ఆదివారం ర్యాలీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో 200 మంది జాతీయ, అంతర్జాతీయ స్కేటర్లు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఘంటసాల సంగీత కళాశాల నుంచి భానునగర్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధిని తట్టుకోలేక పాకిస్తాన్ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తోందన్నారు. పాక్ దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు. ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి సాధిస్తుంటే, పాకిస్తాన్ ఆ దేశ యువకులను ఉగ్రవాదులుగా తయారు చేసి భారత్ పైకి ఉసిగొల్పుతోందన్నారు. పాక్ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎస్.తాతయ్య, కోచ్‌లు వరుణ్, దిలీప్, నాగసేన్, గ్రీష్మిత, మహేష్, నాని, కీర్తి, పాల్గొన్నారు.
బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్ల ర్యాలీ


