రేపటి నుంచి నటరాజస్వామివారి కల్యాణోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీనటరాజస్వామి వారి కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, వధూవరుల అలంకరణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, బలిహరణ, ఔపాసన, మంటప పూజలు సాయంత్రం 6 గంటలకు శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి స్వామి వారి ఆరుద్రోత్సవం(అభిషేకం, అన్నాభిషేకం) జరుగుతాయి. 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం, 10 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
పెండింగ్ పనులపై నిర్లక్ష్యం తగదు
– ఏపీ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్‌బోర్డ్ కార్యాలయంలో బుధవారం 11వ బోర్డ్ సమావేశం జరిగింది. వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రవేశపెట్టిన ఎజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేసి పలు మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలను నియమించారు. అనంతరం 23 జిల్లాల ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్‌లతో జిల్లాలవారీగా పెండింగ్‌లో ఉన్న పనులు, ఫిర్యాదులు, పాత ఉత్తర్వుల అమలుపై సమీక్ష నిర్వహించారు. మెమోలు క్లియర్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై చైర్మన్ అధికారులను వివరణ కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఫేస్–1 ఉమిద్ పోర్టల్ నమోదును నూరు శాతం పూర్తి చేయటంపై అభినందించారు. అదే స్ఫూర్తితో ఫేస్–2 నమోదును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇకపై పెండింగ్ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో బోర్డ్ సభ్యులు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముఖ్రం హుస్సేన్, జాకీర్ అహ్మద్, సీఈఓ మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జనవరి 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నారు. 14వ తేదీ తెల్లివారుజామున ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద భోగి మంటలు వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేదికపై రంగురంగుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాలను సాయంత్రం భోగి పండ్లు పోసే కార్యక్రమాలను ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతి నేపథ్యంలో ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ వైదిక కమిటీ సూచించింది. ఉత్సవాలలో మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణాన్ని మామిడి ఆకులు, అరటి చెట్లతో అలంకరించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
స్వీట్ మ్యాజిక్‌లో అగ్నిప్రమాదం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వన్‌టౌన్ కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద గల స్వీట్ మ్యాజిక్ షాపులో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సీపీఆర్‌పై ఉద్యోగులకు శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యవసర సమయంలో ప్రాణాలను నిలిపే కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్)పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. ఇండియన్ రీససిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్(ఐఆర్‌సీఎఫ్), హెల్త్ యూనివర్సిటీ సంయుక్తంగా బుధవారం హెల్త్ యూనివర్సిటీలోని 150 మంది ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ప్రతి పౌరుడు ప్రాణ రక్షకుడు – మీ రెండు చేతులు ప్రాణాన్ని కాపాడగలవు – మేక్ ఇన్ ఇండియా అనే ప్రేరణాత్మక థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు, సంస్థల సిబ్బందికి అవసరమైన ప్రాణరక్షణ నైపుణ్యాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. వైద్య వృత్తి నిపుణులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా జీవనాధార శిక్షణను విస్తరించాలనే విశ్వవిద్యాలయ సంకల్పాన్ని ఆయన తెలియజేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి మాట్లాడుతూ గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఐఆర్‌సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్‌సీ చక్రరావు, రిటైర్డ్ ఏడీఎంఈ డాక్టర్ టి. సూర్యశ్రీ, ప్రొఫెసర్ కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అమ్మవారికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే డుమావత్ రాజశేఖర్ నాయక్ బుధవారం విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. అనంతరం కుమ్మరిపాలెం సెంటర్‌లో టిఫిన్ చేసి తిరిగి గుడికి వెళ్తుండగా రోడ్డుకు కుడిపక్కన చనిపోయి ఉన్న సుమారు 65–70 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని చూశారు. ఆ వ్యక్తి ఆరెంజ్ కలర్ చెక్స్‌తో ఉన్న షర్ట్, తెలుపు, బ్లూ కలర్, వైట్ చెక్స్ కలిగిన టవల్ కలిగి, తెల్లని జుట్టు, మాసిపోయిన గడ్డంతో ఉన్నాడు. ఈ మేరకు ఆయన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేపటి నుంచి నటరాజస్వామివారి కల్యాణోత్సవాలు
రేపటి నుంచి నటరాజస్వామివారి కల్యాణోత్సవాలు
రేపటి నుంచి నటరాజస్వామివారి కల్యాణోత్సవాలు


