నేరాల నియంత్రణలో కృష్ణాకు ప్రథమస్థానం
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు బుధవారం ఓ తెలిపారు. సంవత్సరాంతపు నేరసమీక్ష వివరాలను ఆ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులను 2024 ఏడాదితో పోలిస్తే 2025లో 29 శాతం తగ్గించగలిగామని పేర్కొన్నారు. ముందస్తు నిఘా, విజువల్ పోలీసింగ్, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమాచార వ్యవస్థ ద్వారా 32 శాతం నేరాలను అరికట్టామని వివరించారు. 2024లో 101 సైబర్ నేరాలు నమోదవగా 2025లో వాటి సంఖ్య 79 మాత్రమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నియంత్రించామని పేర్కొన్నారు. మీ – కోసం కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి అడుగులు వేయగలిగామని తెలిపారు. నేరాల నియంత్ర ణలో భాగంగా జిల్లాలోని రౌడీషీటర్లపై నిరంతరం నిఘా పెట్టి ఉక్కు పాదం మోపామని పేర్కొన్నారు. 2026లో మరింత సమర్థంగా విధులు నిర్వహించి ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కృషి చేస్తా మని తెలిపారు. చోరీలకు సంబంధించి 2024లో 711 కేసులు నమోద వగా 2025లో వాటి సంఖ్య 606 మాత్రమేనని వివరించారు. పోక్సో కేసులకు సంబంధించి గత యేడాది 133 కేసులు నమోదవగా ఈ ఏడాది 77 కేసులకు పరిమితమయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2024లో 309 కేసులు నమోదగా 338 మంది చనిపోయారని, 2025లో 368 కేసులు నమోదువగా 394 మంది మరణించారని వివరించారు. గత యేడాది రూ.6.05.10.526 కోట్ల సొత్తు చోరీకి గురికాగా రూ.3,08,86,634లను రికవరీ చేశామని, 2025లో చోరీకి గురైన రూ.5,54,55,753 సొత్తులో రూ.2,86,64,257 రికవరీ చేశామని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి 2024లో 428.833 కిలోలు పట్టుకోగా 2025ల 475.261 కిలోలు పట్టుకున్నామని వివరించారు. ఈ కేసులకు సంబంధించి 150 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2024తో పోలిస్తే 2025లో గణనీయంగా కేసులు నమోదు తగ్గిందని పేర్కొన్నారు.


