స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 2వ తేదీ నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. కట్టింగ్ అండ్ టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీకల్ టెక్నీషియన్ హెల్పర్, ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిజం, మెషిన్ ఎంబ్రాయిడరీ, డ్రస్ డిజైనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిర్రర్ వర్క్, హోమ్ క్రాప్ట్స్, జామ్ అండ్ జ్యూస్ మేకింగ్, స్మాకింగ్ మొదలైన అంశాల్లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ సమీపంలో ఉన్న తమ సంస్థ కార్యాలయంలో నేరుగా కాని 0866–2470420 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు
పమిడిముక్కల: నాటకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మేడూరు గ్రామంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన గ్రామ పెద్దలు గుళ్లపల్లి సురేష్‌బాబు, సుంకర వెంకటేశ్వరస్వామితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 200 నాటక సంఘాలు రిజిస్టర్ చేసుకొన్నారని, ఈ సంఘాలు నాటకాలు వేసినప్పుడు అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కళాకారులు ప్రొఫెషనల్స్ టీమ్‌గా ఏర్పడి ప్రదర్శనలు ఇచ్చి జీవనోసాధి పొందవచ్చన్నారు. నాటకాలు ప్రదర్శించేందుకు వీలుగా 50 టూరిజమ్ స్పాట్స్‌ను గుర్తించామని తెలిపారు. కళారంగం కళకళలాడుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మేడూరు గ్రామంలో హైస్కూల్, నాలుగు వైపులా ఉన్న ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. అకాడమీలో అన్ని రకాల నాటకాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
పీజీ వైద్య ఫలితాల్లో
స్టేట్ ఫస్ట్
అవనిగడ్డ: పీజీ వైద్య ఫలితాల్లో అవనిగడ్డకు చెందిన కూనపరెడ్డి లాస్యకృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్ధానం సాధించింది. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ సర్జన్(ఈఎన్‌టీ) విభాగంలో 800 మార్కులకు 585 మార్కులు సాధించింది. 2014–20లో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన లాస్యకృష్ణ పీజీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు కూనపరెడ్డి బాలరమేష్‌బాబు, సరోజ చెప్పారు. తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాగా, తల్లి సరోజ ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. స్టేట్‌ఫస్ట్ సాధించిన లాస్యకృష్ణకు పలువురు అభినందనలు తెలిపారు.
హిందీ కార్యశాల ప్రారంభం
పాయకాపురం(విజయవాడరూరల్): ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ న్యూ రాజీవ్‌నగర్‌లో బుధవారం రాజభాష హిందీ కార్యశాల నిర్వహించారు. సంస్థ ఇన్‌చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో నిర్వహిస్తున్న హిందీ కార్యక్రమాల గురించి, హిందీ భాషలో అవగాహన పెంచుటకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ప్రత్యేక అతిథి హేమంత్ వాడేకర్ మాట్లాడుతూ సంస్థ సిబ్బంది సమగ్రంగా హిందీ భాషపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పరిశోధనాధికారి డాక్టర్ సవిత పోశెట్టి గోపాడ్, డాక్టర్ సుజాత పి.డోకె(పరిశోధనాధికారి), పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు


