నూతన ఆలోచనలతో సమగ్రాభివృద్ధి
జీపీఏ పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం మహిళలకు స్వయంవృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక జిల్లాలో ఆరు పంచాయతీలకు ఎన్‌ఎస్‌ఓ సర్టిఫికెట్లు 2026లో కొత్త ఆలోచనలతోసమష్టిగా శ్రమిస్తాం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా అధికార బృందం 2026వ సంవత్సరంలో నూతన ఆలో చనలతో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, సాధించేందుకు సమష్టిగా శ్రమిస్తా మని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. 2025 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లా ఆదాయాన్ని పెంచేలా ప్రాథమిక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధశాఖల ద్వారా జీపీఏ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తామన్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 65,925 ఎకరాల్లో ఆక్వా జోన్ ఇప్పటికే ఉందని, ఇంకా వచ్చిన దరఖాస్తులను బట్టి ఈ విస్తీర్ణాన్నిపెంచే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. నందివాడ మండలంలో డిజిటల్ ట్రేసబులిటీ కోసం 102 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
5,42,609 టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఇప్పటి వరకు 5,42,609 టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. గతేడాదితో నుంచి పోల్చు కుంటే 1.20 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేశామన్నారు. 106 ఉన్నత పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికాభి వృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించామన్నారు. బందరు మండలం చిన్నాపురంలో గుర్రపు డెక్కతో కళాకృతులు తయారుచేసి వాటి విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 377 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
పంచాయతీల బలోపేతానికి చర్యలు
జిల్లాలో పంచాయతీలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. గన్నవరం పంచాయతీలో క్రికెట్ నెట్, కేసరపల్లిలో కుంభకోణం కాఫీ షాప్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఆరు పంచాయతీలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ సాధించామని, ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. 17 మంది అనాథ పిల్లలను దత్తత ఇచ్చామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం 1,196 మందికి చెందిన 320 ఎకరాలను 22ఏ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో కలెక్టరేట్‌లో అమృత కృష్ణ పేరుతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శబ్ద, వాయు కాలుష్య నివారణకు ప్రతి శనివారం అధికారులు కాలినడకన లేదా సైకిళ్లపై విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాలో 5,318 గృహాలకు సోలార్ సిస్టమ్‌ను అందించి రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. కృష్ణసంకల్పం పేరుతో 42 బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో 2026వ సంవత్సరంలో నూతన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు.


