సమస్యల పరిష్కారం కోసం 104 ఉద్యోగుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 వాహనాల ఉద్యోగుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.ఫణికుమార్ మాట్లాడుతూ.. భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు అందించాల్సిన మందులను 104 వాహనాల్లో తగినంతగా సరఫరా చేయడం లేదని, దీని వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. డిసెంబర్ 19 నుంచి 23 వరకు ముందస్తు నోటీసులు జారీ చేసి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించకపోతే జనవరి రెండో తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, ఆరో తేదీన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 104 ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం పూర్తి సంఘీభావం తెలుపుతోందన్నారు. భవ్య యాజమాన్యం తగ్గించిన వేతనాలను సవరించి పూర్తి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం కూడా జీతాల పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన క్యాజువల్ లీవ్‌లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులను 104 ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఎ.మురళీకృష్ణ, కార్యదర్శి డి.వినయ్, కోశాధికారి బి.సుబ్బారావు, ఎస్.వెంకట తేజ తదితరులు పాల్గొన్నారు.


