
పాఠశాలను మా ఊరి నుంచి తరలించొద్దు సారూ!
వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురం పాఠశాలను గ్రామానికి దూరంగా తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వేడుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరంలోని వక్కపట్లవారిపాలెం పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టారని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని వాపోయారు. బ్రహ్మానందపురంలో నివసించే వారంతా షెడ్యూల్ కులానికి చెందినవారని, ఇక్కడి పాఠశాలలో 45 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్న పిలల్లని, వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వెళ్తారని ప్రశ్నించారు. మార్గ మధ్యంలో అవనిగడ్డ–నాగాయలంక, భావదేవరపల్లి ప్రధాన రహదారులు ఉన్నాయని ఈ రహదారులు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీతో ఉంటాయని, చిన్నపిల్లలు ఆ రోడ్ల వెంట ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. విద్యాశాఖ ఉద్యోగుల సౌలభ్యం కోసం పాఠశాలను తరలించే ప్రయత్నం విరమించకపోతే ప్రత్యక్ష కార్యాచరణతో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని 30 మందికి పైగా గ్రామస్తులు బందరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
కలెక్టర్‌కు బ్రహ్మానందపురం
వాసుల వేడుకోలు