ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమలగిరిలోని వాల్మీకోద్భవ వెంకటేశ్వరస్వామి దత్తత దేవాలయం అయిన మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం ప్రమాదభరితంగా ఉంది. తిరుమల గిరి ఆలయానికి నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయానికి ఆదాయం ఉన్నా కూడా అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలగిరికి వచ్చే భక్తులు ముందుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండపైన గల శివాలయానికి చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అయితే కొండ పైకి వెళ్లే మెట్ల మార్గం అధ్వానంగా ఉంది. మెట్లు పగుళ్లు ఇచ్చి నడిచేందుకు ఇబ్బందికరంగా ఉండ టంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన మెట్లు కావడంతో పూర్తిగా పగుళ్లు ఇచ్చి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పరమశివుడిని దర్శించుకోవాలంటే భక్తులు పడరానిపాట్లు పడవలసిందే. దాదాపు 70కి పైగా మెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. మరో పక్క మార్గంలో ఇరుపక్కల రైలింగ్ కూడా లేకపోవ డంతో చిన్నారులు, వృద్ధులు అష్టకష్టాలు పడా ల్సివస్తోంది. కొందరు భక్తులు అయితే గాయాలపాలవుతున్నారు. ఆలయ అధికారులు ఆలయానికి ఆదాయం పెంచుకునేందుకు కొండపైకి స్వామివారి దర్శనం టికెట్కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నప్పటికీ మెట్ల మార్గం అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా మార్గాన్ని శుభ్రం చేయడంలేదు. దీంతో మెట్ల మార్గంలో చెత్తచెదారం పేరుకుపోతోంది. కొండ కింద నుంచి వెళ్లే మెట్ల మార్గంలోని కొన్ని మెట్లు టైల్స్ పగిలి పోయి ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు స్పందించి మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా


