దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు డిమాండ్ ఏర్పడింది. భక్తుల రద్దీ ఉదయం సాధారణంగా ఉండగా, 11 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెలుపుల ఉన్న వేద ఆశీర్వచనాన్ని గురువారం నుంచి ఆలయం లోపల మండపంలోకి మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఒక సారిగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమ య్యారు. సర్వ దర్శనానికి రెండు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు రూ.100 టికెట్ క్యూలైన్‌లోకి ఉచి తంగా మళ్లించి రద్దీని నియంత్రించారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. పలువురు పుర ప్రముఖులు, వీఐపీలు సైతం మహా నివేదన అనంతరం అమ్మ వారి దర్శనానికి విచ్చేయడంతో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ నేపథ్యంలో ఏఈఓలతో పాటు పలువురు సూపరింటెండెంట్లకు, ఇతర సిబ్బందికి ఆలయంలో ప్రత్యేక విధులు కేటా యించారు. మరోవైపు ఆలయానికి చేరుకునే క్యూలైన్లతో పాటు గాలిగోపురం, వీఐపీ మార్గం, సింహద్వారాల వద్దకు భక్తులు చేరుకుని తమను అలయంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్


