జోరువాన..! | - | Sakshi
Sakshi News home page

జోరువాన..!

Jul 30 2026 12:15 AM | Updated on Jul 30 2026 12:15 AM

ఎట్టకేలకు కరుణించిన వరుణుడు జిల్లావ్యాప్తంగా ముసురు వట్టివాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రెలు, వాగులు నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం

ఆసిఫాబాద్‌రూరల్‌: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. పంటలకు జీవం పోస్తూ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జోరువాన కురిసింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని వా వుదాం, తుంపెల్లి, గుండి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు ప్రాజెక్టులోకి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటికి వదులుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం 41.7 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, తిర్యాణిలో అత్యధికంగా 108.2 మి.మీ.లు, అత్యల్పంగా వాంకిడిలో 3.8 మి.మీల వర్షం కురిసింది. గురు, శుక్రవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

రెబ్బెన: వర్షం కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఓసీపీలోని హాల్‌రోడ్లు బురదమయంగా మారగా, క్వారీ లోపలి పనిస్థలాలు వరదతో నిండాయి. దీంతో అధికారులు ఉత్పత్తి ప్రక్రియను నిలిపివేశారు. క్వారీ లోపల చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్‌ చేస్తున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్‌ నుంచి బుధవారం రెండో షిఫ్ట్‌ వరకు ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోగా.. సుమారు 10వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నష్టం సంభవించిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఏరియాకు సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. వర్షం తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తిని చేపట్టేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న గంగాపూర్‌ వాగు

ఉప్పొంగిన వాగులు

రెబ్బెన: మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు ఉప్పొంగాయి. గుండాల, పులికుంట, గంగాపూర్‌, లక్ష్మిపూర్‌ పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాల్లో ఇది రెండోది కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement