ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు, పంచాయితీరాజ్, తాగునీటి సరఫరా, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వీబీజీ రామ్‌జీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పంచాయతీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల పురోగతిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


