
‘అటవీ అధికారుల తీరు సరికాదు’
పెంచికల్‌పేట్(సిర్పూర్): రిజర్వ్ ఫారెస్టు పేరుతో ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారుల తీరు సరికాదని మండలంలోని అగర్‌గూడ గ్రామస్తులు విమర్శించారు. గ్రామంలో మంగళవారం వారు మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణ సమయంలో అటవీశాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టు పేరుతో అడ్డుకుంటూ లబ్ధిదారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఫారెస్టు కార్యాలయానికి పిలిచి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.