ఆసిఫాబాద్‌అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తూ.. మాజీ మంత్రి హరీశ్‌రావుపై నిందలు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద మంగళవారం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ డైవర్షన్ పాలి టిక్స్ చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను రాజకీయాలకు వాడుకుని తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కు నిజాలు తెలియకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగాన్ని మంత్రులు పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కలాం, రవీందర్, నిసార్, సత్తన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.