క్షతగాత్రులు, రోగుల ప్రాణం నిలుపుతున్న ‘108’ బాలింతలు, గర్భిణులకు 102 ఎనలేని సేవలు అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ల్లోనే ప్రసవాలు ఈ ఏడాది 36 వేల మందికిపైగా లబ్ధి
వాంకిడి(ఆసిఫాబాద్): అత్యవసర సమయంలో సేవలందించడంలో 108 వాహనాలు మేటిగా నిలుస్తున్నాయి. ఆపద వేళ ఒక్క ఫోన్ కాల్‌తో క్షణా ల్లో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు నిలుపుతున్నాయి. గర్భిణులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు 15 ఉండగా, 102 వాహనాలు మరో 15 ఉన్నాయి. మండలాల వారీగా ఆయా ఆస్పత్రుల వద్ద అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంటూ పేదలకు సంజీవనిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు ఈ వాహనాలు వరంలా మారాయి. బాధితుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన 15 సెకన్ల వ్యవధిలోనే ప్రయాణం ప్రారంభించి నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుతున్నాయి. జిల్లాలో 108, 102 వాహనాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 36,805 మంది లబ్ధి పొందారు.
108 సేవలు కీలకం..
రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడంలో 108 సేవలు అత్యంత కీలకం. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 వాహనాలు సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు వరకు 108 వాహనాల ద్వారా జిల్లాలో 11,083 మంది సేవలు పొందారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చడమే కాకుండా వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న జిల్లాలో ప్రసవాలు చేయడంలో కూడా సిబ్బంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పురిటినొప్పులు ఎక్కువైన సందర్భంలో మార్గమధ్యలో వైద్యుల సూచనలతో ప్రసవం చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలు కాడుతున్నారు. 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు 47 మంది గర్భిణులకు 108 వాహనంలో ఆస్పత్రులకు వెళ్లకముందే మార్గమధ్యలో ప్రసవం చేశారు. డెలీవరీ అనంతరం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు.
‘అమ్మ’కు 102 సేవలు
108 అంబులెన్స్‌లతోపాటు జిల్లాలో 102 వాహనా లు ఉత్తమ సేవలందిస్తున్నాయి. 102 వాహనాలు ప్రవేశపెట్టిన తర్వాత గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయని అనడంలో సందేహం లేదు. ఈ వాహనాల ద్వారానే గర్భిణులు ప్రతినెలా మంత్లీ చెకప్‌లకు సులభంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. మారుమూల గిరిజన మండలాల వారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రితోపాటు ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు వెళ్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సురక్షితంగా ఇంటి వద్ద దించుతున్నారు. గర్భం దా ల్చిన మహిళల పేర్లను ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నమోదు చేసుకుని నెలనెలా 102 వాహనాల ద్వారా సమయానుసారంగా సేవలందిస్తున్నారు. ప్రసవం అనంతరం కూడా తల్లీబిడ్డలను ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ ఏడాది 102 వాహనాలు 11,335 ట్రి ప్పులు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు.
108లో ప్రసవం
కౌటాల(సిర్పూర్): మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన గర్భిణి జంగంపల్లి రేణుకకు శుక్రవారం రాత్రి పురుటి నొప్పులు రాగా 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని గర్భిణిని కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ పిట్టల విజయ్, పైలట్ సురేశ్ వాహనంలో సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు.
క్షణాల్లో ఘటనాస్థలికి..
పకడ్బందీ ప్రణాళికతో 108 వాహనాలు ఫోన్ ద్వారా సమాచారం అందిన కొన్ని క్షణాల్లోనే ఘటనా స్థలికి చేరేలా 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నాం. గర్భం దాల్చిన మహిళలకు మొదటి నెల నుంచే 102 వాహనాల ద్వారా సేవలందిస్తాం. నెలవారీ చెకప్‌లు, ప్రసవం అనంతరం ఇంటికి చేర్చే వరకు సేవలు పొందవచ్చు. సరైన కండిషన్‌లో ఉన్న వాహనాల్లో పైలట్‌తో పాటు ఒక ఈఎమ్‌టీ ఉండి అత్యవసర సేవలు అందిస్తారు. ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు అత్యవసర సమయాల్లో గర్భిణులకు డెలీవరీ చేస్తారు. జిల్లాలోని ప్రజలు అత్యవసర వాహనాల సేవలు వినియోగించుకోవాలి.
– సతీశ్‌కుమార్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్
సేవల్లో మేటి!
సేవల్లో మేటి!