
సాగులో సలహాలు..
జిల్లాలో మూడు మండలాల్లో అవగాహన సదస్సులు పంటల సాగు, మార్కెటింగ్ గురించి వివరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వేల సాయిల్ టెస్టు కార్డులు పంపిణీ
పెంచికల్‌పేట్(ఆసిఫాబాద్): వర్షాకాలం పంటలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీరితోపా టు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అఫైర్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్‌లో రిజిస్టర్ అయిన భా రతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్త, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి న అభ్యర్థులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ రైతులకు మట్టి పరీక్షలు, శాసీ్త్రయ పద్ధతుల్లో పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, పంటల ఉత్తత్తి, మార్కెటింగ్‌పై మెలకువలు వివరిస్తున్నారు.
మూడు మండలాల్లో సేవలు
కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సేవలు ప్రారంభించింది. జిల్లాలోని పెంచికల్‌పేట్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్ మండలాల్లో సంస్థ ఏప్రిల్ నుంచి సేవలు ప్రారంభించింది. ఈ మూడు మండలాల్లో ఫార్మరీ రిజిసీ్ట్రలో నమోదు చేసుకున్న రైతులు 1100 మంది ఉన్నారు. ప్రతీ మూడు మండలాలకు సదరు సంస్థ ఒక అగ్రిసైంటిస్టుతోపాటు పంట చేలను సందర్శించి రైతులకు సలహాలు అందించడానికి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన 11 మంది అభ్యర్థులను నియమించింది. వీరు ఎంపిక చేసిన రైతుల పంట పొలాలను నిత్యం సందర్శిస్తున్నారు. పొలాల్లో మట్టిని సేకరించి సాయిల్ టెస్టు నిర్వహించారు. దుక్కిలో ఎరువుల వాడకం, విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల పిచికారీ, చీడపీడల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో కలిసి చేలను సందర్శిస్తూ పత్తి, వరి, మిర్చి పంటలకు సోకుతున్న తెగుళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. సాగు యాజమాన్య పద్ధతులపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రైతులకు ఉపయోగం
జిల్లాలోని మూడు మండలాల్లో ప్రస్తుతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేలను సందర్శిస్తున్నారు. పంటలకు సోకిన చీడపీడలను గుర్తించి రైతులకు అక్కడిక్కడే అవగా హన కల్పిస్తున్నారు. ఎలాంటి తెగులు సోకింది.. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవా లి.. ఎలాంటి మందులు వాడాలి.. తదితర విషయాలు విరిస్తున్నారు. జిల్లాలో యూరి యా కొరత నేపథ్యంలో నానో యూరియా వాడకంలో శిక్షణ అందించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేయాల్సిన రసాయనిక మందుల మోతాదు గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు 2000 వరకు మట్టి పరీక్షల కార్డులు పంపిణీ చేశారు.