
దసరాలోపు ఎనిమిది రైళ్లకు హాల్టింగ్
కాగజ్‌నగర్‌టౌన్: దసరాలోపు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఎనిమిది రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు కృషి చేశారన్నారు. సికింద్రాబాద్– ముజఫర్‌పూర్ వరకు వయా కాగజ్‌నగర్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు– ధానాపూర్‌ల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్– గోరక్‌పూర్ మధ్య నడిచే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు– పాటలీపుత్ర మధ్య నడిచే పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగజ్‌నగర్ స్టేషన్‌లో నిలపనున్నారని తెలిపారు. దీంతో ఉత్తరాన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు దక్షిణాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. అలాగే మన ప్రాంతంలోని బెంగాళీలకు ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించడంతో దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. స్మార్ట్‌కార్డులు, సిమెంట్, ఇనుము, వాహనాలకు జీఎస్టీ శాతం తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనగర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్, అరుణ్‌లోయ, తిరుపి, సంతోష్, సదానందం, కోట వేణు, సాయి, చిట్టంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.