
ఎస్పీఎం నుంచి కలుషిత వాయువులు!
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గురువారం అర్ధరాత్రి కలుషిత వాయువులు వెలువడ్డాయని స్థానిక ప్రజలు ఆరోపించారు. సర్దార్‌బస్తి, నిజాముద్దీన్ కాలనీ, ఓల్డ్‌కాలనీ, ద్వారకానగర్, మార్కెట్ ఏరియా, లారీ చౌరస్తా, నౌగాం బస్తి, బాలాజీనగర్, పెట్రోల్‌పంప్ ఏరియాల్లో పొగ నిండిపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. దుర్వాసన రావడంతోపాటు తల తిప్పడం, విపరీతమైన దగ్గు వస్తుందని పట్టణ ప్రజలు వాపోయారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మిల్లు నుంచి వారానికి రెండుసార్లు రాత్రి లేదా ఉదయం 4 గంటల సమయంలో కలుషిత వాయువులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు యజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గేటు ఎదుట ధర్నా
సిర్పూర్ పేపరు మిల్లుతో వస్తున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యాజమాన్యం స్పందించడంలేదని పట్టణంలోని ఓల్డ్‌కాలనీ, న్యూకాలనీ, పలు కాలనీల ప్రజలు శుక్రవారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ మిల్లు కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంటపాటు ధర్నా చేయగా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో డౌన్‌డౌన్ అంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.